
భీష్మ పితామహుని స్మరణతో జీవితం పవిత్రమయ్యే శుభతిథియే భీష్మాష్టమి. దీని ప్రాముఖ్యత ఏంటంటే.. రథసప్తమి తరువాత వచ్చే అష్టమి తిథియే భీష్మాష్టమి. అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షిస్తూ, శ్రీకృష్ణుని ధ్యానంతో పరమపదం చేరిన మహాత్ముడు భీష్ముడు ఈ రోజునే దేహత్యాగం చేశాడు. అందుకే ఈ తిథి ధర్మశాస్త్రాలలో అత్యంత విశేషంగా పేర్కొనబడింది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా, సత్యం–త్యాగం–నిష్ఠలకు ప్రతిరూపంగా జీవించాడు.
భగవాన్ శ్రీహరిని కన్నులారా దర్శిస్తూ ముక్తి పొందిన అపూర్వ మహానుభావుడు. భీష్మాష్టమి నాడు భీష్మ తర్పణం చేస్తారు. దీనిని ఎవరు చేస్తారో తెలుసుకుందాం. సాధారణంగా పితృతర్పణం తండ్రి లేనివారే చేస్తారు అనే భావన ఉన్నా, భీష్మ తర్పణం మాత్రం తండ్రి జీవించి ఉన్నవారు కూడా తప్పక చేయాలి అని ధర్మశాస్త్ర ఆజ్ఞ. స్త్రీలు తప్ప మిగతా అందరూ ఈ రోజున భీష్మునికి తిల–జల అర్ఘ్యప్రదానం చేయడం కర్తవ్యంగా చెప్పబడింది. ఇది పెద్ద కర్మకాండ కాదు. నిత్యకర్మలు పూర్తిచేసుకుని, శుద్ధ మనస్సుతో 10 నిమిషాల్లో చేయగల సులభమైన ధర్మాచరణ.
