
మంగళగిరి నరసింహుణ్ణి పానకాల స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి నోటిలో పానకం పోస్తే గుటక వేసిన శబ్దం వినిపిస్తుందంటారు. మంగళగిరి అగ్నిపర్వతం కనుక పానకం పోసి భక్తులు చల్లారుస్తుంటారని లౌకికులు చెబుతారు. ఎంత పానకం పోసినా గర్భగుడిలో చీమలు, ఈగలు కనిపించక పోవడం భక్తులను ఆశ్చర్యంలో ముంచుతుంది. ఫాల్గుణ శుద్ధ చతుర్దశినాడు మంగళగిరి స్వామికి కల్యాణం నిర్వహిస్తారు. శ్రీ హరికోసం శ్రీలక్ష్మి తపస్సు చేసిన ప్రదేశం మంగళగిరి. మంగళగిరిలో మూడు నరసింహ ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరాన గండాల నరసింహస్వామి ఆలయం. మంగళాద్రి నృసింహునికి కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పించారు.
కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. అప్పుడు పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజూ పానకం వినియోగమవుతున్నా, గుడిలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం వుంది. కొండ శిఖరానవున్న గండాల నరసింహస్వామి మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ గండదీపాలు వెలిగిస్తారు. కొండకింద శ్రీలక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో భ్రమరాంబా మల్లికార్జునస్వామిని పాండవులు ప్రతిష్టించారని స్థలపురాణం.
