తిరుమలలో గత మూడురోజులుగా జరిగిన పురందరదాసు ఆరాధనోత్సవాలు ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు గురువారం నాడు ఆస్థాన మండపంలో ఘనంగా ముగిశాయి. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, మానవ జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలకు పూర్వజన్మ కర్మ ఫలమే కారణమన్నారు.
ఈ పూర్వజన్మ కర్మఫలం నుంచి బయట పడటానికి మహాత్ములను సందర్శించి వారి మార్గదర్శకంలో భగవంతుడిని సేవించడం ద్వారా మోక్షం పొందవచ్చని వివరించారు. అదేవిధంగా తన జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుల వారికే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.