తిరుమల శ్రీవారి ఆలయం మరో చోట కూడా కొలువుదీరింది. శ్రీ వేంకటేశ్వరస్వామి అచ్చు తిరుమలలో మాదిరిగా కొలువుదీరి భక్తకోటికి తన ఆశీర్వాదాలు అందజేస్తున్నాడు. అది చూస్తే తిరుమలలో ఉన్న భావనే భక్తులకు కలగడం ఖాయం. అంతేనా.. తిరుమలలో మాదిరిగానే నిత్య కైంకర్యాలు, నివేదనలు అన్నీ నిరవ్హించనున్నారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడంటారా? ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాలో నమూనా ఆలయాన్ని టీటీడీ రూపొందించింది. జనవరి 8న తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్‌కు శ్రీవారి కల్యాణ రథాన్ని పంపిన విషయం తెలిసిందే.
ప్రయాగ రాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు ప్రతిష్టాత్మకంగా కుంభమేళా జరగనుంది. ఈ ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి ఆలయ సమీపంలో 2.89 ఎకరాల్లో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటైంది. ప్రతిరోజూ ఇక్కడ తిరుమల తరహాలోనే స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు, సుప్రభాత సేవ, ఏకాంత సేవ వరకూ అన్నీ నిర్వహించనున్నారు. ఇక శ్రీవారి కల్యాణాలు సైతం నిర్వహించనున్నారు. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే శ్రీవారి కల్యాణ రథం ఇప్పటికే అహ్మదాబాద్ చేరింది. నమూనా ఆలయంలో కైంకర్యాలు నిర్వహించేందుకు 170 మంది టీటీడీ అర్చకులతో కలిపి సిబ్బందిని తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది.