శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకూ శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 11 రోజులపాటు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైలం ఆలయ అధికారులు సమావేశం నిర్వహించారు. శ్రీశైలం కార్యనిర్వాహణ అధికారి ఎం.శ్రీనివాసరావు దేవస్థానం, ఇంజనీరింగ్ అధికారులతో పర్యవేక్షకులు, వైదిక కమిటీతో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రూపొందిన డాక్యుమెంటరీని ప్రదర్శించిన అనంతరం వచ్చే ఏడాది నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల గురించి ముచ్చటించారు.

మహా శివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణంతో పాటు ఆ మరునాడు నిర్వహించే రథోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం కొందరు భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు పాదయాత్రతో వస్తుంటారు. ఈ పాదయాత్ర నిర్వహిస్తూ వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. అటవీశాఖ సహకారముతో నడకదారిలో వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని ఇంజినీరిగ్ విభాగం అధికారులకు శ్రీశైలం కార్య నిర్వహణాధికారి తెలిపారు. ముఖ్యంగా శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు.

Share this post with your friends