ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. 70 అడుగుల సప్త ముఖ మహా గణపతిని ప్రతిష్టించడం ఒక పెద్ద ప్రాసెస్ అయితే నిమజ్జనం మరో కీలక కార్యక్రమం. గతంలో అయితే అన్నింటికంటే చివరిలో ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేవారు. కానీ అలా చేస్తే చాలా లేటు అయిపోతోంది. కాబట్టి గత ఏడాది నుంచి కాస్త రూల్స్ మార్చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని ముందుగా నిమజ్జనం చేస్తున్నారు. తాజాగా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న అనంతరం సీపీ సీవీ ఆనంద్ ఉత్సవ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనంపై క్లారిటీ ఇచ్చారు.
ఉదయం 6 గంటలకు అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేలా చేసి విగ్రహాన్ని తరలించడానికి సన్నాహాలు చేస్తామని సీపీ వెల్లడించారు. 70 అడుగుల భారీ విగ్రహం కాబట్టి త్వరగా నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్యాహ్నం 1:30లోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. గణేష్ చతుర్థి రోజున హైదరాబాద్ సీపీగా నియమితులవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. వినాయకుడి అనుగ్రహంతోనే మరోసారి సిటీ పోలీస్ కమిషనర్‌గా అవకాశం వచ్చిందని భావిస్తున్నానని తెలిపారు. ఒక భక్తుడిగా.. తనను వినాయకుడే హైదరాబాద్‌కు రప్పించాడన్నారు.