
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఈ క్రమంనే శనివారం స్వామివారికి రెండు గొడుగులు కానుకగా అందాయి. తిరునిన్రావుర్కు చెందిన శ్రీ భాష్యకార కైంకర్య ట్రస్టు వ్యవస్థాపక ట్రస్టీ శ్రీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మంకు అందించారు.
శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు..
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న పులివర్తి నాని దంపతులకు జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
