ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నూతన సంవత్సరంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మహా కుంభమేళాలో సనాతనయేతరుల ప్రవేశాన్ని అఖారా పరిషత్ నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా నాగ సన్యాసులు సైతం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. వీటిని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. మహా కుంభమేళాకు వచ్చే వారంతా తప్పనిసరిగా నుదుటిపై తిలకం, మణికట్టుపై కాలవ తప్పని సరి అని పేర్కొన్నారు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించేలా ఎవరూ ప్రవర్తించకూడదనే చర్య తీసుకున్నట్టు.. అలాగే మత స్వచ్ఛతను కాపాడేందుకే ఈ మార్గదర్శకాలను అమలు చేసినట్టు జునా అఖారాకు చెందిన నాగ సన్యాసి శంకర్ భారతి వెల్లడించారు.
అఖారాస్‌లోని అన్ని ప్రవేశాల వద్ద పోలీసులను మోహరింప జేస్తామని శంకర్ భారతి పేర్కొన్నారు. ఈ మార్గదర్శకానికి మద్దతు ఇస్తున్నట్టుగా జునా అఖారాకు చెందిన మహిళా సన్యాసి దివ్యగిరి తెలిపారు. మహిళా సన్యాసుల అఖారాలలో సైతం ఈ విధానాన్ని అమలు చేసేలా అఖారా వెలుపల మహిళా సాధువును ఉంచుతామన్నారు. నుదుటిపై తిలకం పెట్టుకున్న తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. సనాతనేతరులు ఎవరైనా మన సంస్కృతికి విరుద్ధంగా జాతర ప్రాంతంలోకి ప్రవేశిస్తే పట్టుకుని శిక్షిస్తామని నాగ సన్యాసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా మహా కుంభంలోకి సనాతనేతరులు ప్రవేశించకుండా కఠిన శిక్షలు వేస్తామని నాగ సాధువులు స్పష్టం చేశారు.