టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు విన్నవించారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా చేస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని సూచించారు. టీటీడీ లో పాలక మండలిలో చర్చించి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడం తమ బాధ్యతన్నారు. టీటీడీ ఛైర్మన్ , ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు, సమన్వయ లోపం అసలు లేదన్నారు. టీటీడీ ఛైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించిన సూచన మేరకు అమలు చేస్తున్నామన్నారు. గత 6 నెలల కాలంలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, నెయ్యి సేకరణ, వసతి తదితర సేవలు అందిస్తున్నామన్నారు. టీటీడీలో దళారి వ్యవస్థను పూర్తిగా కట్టడి చేస్తున్నామని, ఆన్ లైన్ లో మోసాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీలో విజన్ డాక్యుమెంట్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన సందర్భాలలో వివిధ రంగాల నిపుణుల సూచనలు, సహకారం తీసుకోవడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందన్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు టీటీడీ ఈవో మాట్లాడుతూ, తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనం, క్యూలైన్లు, అన్నప్రసాదాలు, కంపార్ట్మెంట్ల నిర్వహణ, వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, తదితర అంశాలు పూర్తిగా టిటిడి పరిధిలో ఉంటుందన్నారు, తిరుపతిలో జన రద్దీని ఎలా అదుపు చేయాలి, జన రద్దీ నిర్వహణ, క్యూలైన్ మేనేజ్మెంట్ , భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎన్ని ఏర్పాటు చేయాలి, వాటి పటిష్టత ఎంత ఉండాలనే అంశాలు పూర్తిగా జిల్లా మేజిస్ట్రేట్ , జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. వారి సూచనల మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకుని, వారి సూచనల మేరకు టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఎక్కడైనా జన రద్దీని పూర్తిగా అదుపు చేయాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ చేతిలో ఉంటుందన్నారు. భక్తుల తోపులాట అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరుగుతోందని, న్యాయ విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు.