దేశంలోనే అత్యంత ఎత్తైన పంచతల గోపురంగా యాదాద్రి లక్ష్మీనరసింహుని గోపురం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమల తరహాలో ఈ క్షేత్రానికి ప్రాచుర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే స్వామివారి ఆలయం కొత్త రూపు సంతరించుకుంది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురాన్ని స్వర్ణమయం చేసింది. ప్రస్తుతం స్వామివారి గోపురం బంగారు తొడుగులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళ లైటింగ్ నడుమ ఈ గోపురం మిలమిలా మెరుస్తూ ఆకర్షణీయంగా కనువిందుచేస్తోంది. ఆలయ ఉద్ఘాటన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దివ్య విమాన గోపురాన్ని125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయాలని నిర్ణయించారు. దీనికోసం భక్తుల నుంచి విరాళాలను ఆహ్వానించారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు.

ఆ తరువాత ప్రధాన ఆలయ దివ్య గోపురం స్వర్ణ తాపడానికి మొత్తం 165 కిలోల బంగారు తాపడానికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే దాతల నుంచి కేవలం 11 కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు మాత్రమే చేకూరింది. ఆ తరువాత హుండీ ద్వారా వచ్చిన 1300 కిలోల వెండి, నగల రూపంలో వచ్చిన బంగారాన్ని విమాన గోపురం తయారీకి వినియోగించింది. మొత్తానికి గర్భాలయంపై 49.5 అడుగుల ఎత్తు, 10,857 చదరపు అడుగుల మేర ఉన్న విమానానికి 68 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేశారు. దీంతో దేశంలోనే అత్యంత ఎత్తైన పంచతల గోపురంగా 50.5 అడుగులతో యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం నిలుస్తోంది. ఈ పనులను నానో టెక్నాలజీతో పూర్తి చేశారు. 24 క్యారెట్ల బంగారం తాపడంతో 50 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా పనులు జరిగాయి.

Share this post with your friends