భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 40 మంది సిబ్బంది, 3 ట‌న్నుల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల 30 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో బత్తాయి, ఆపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పైభాగంలో గజ లక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.

చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో, పుష్కరిణి వద్ద, వాహన మండపం వద్ద, ఫ్రైడే గార్డెన్స్, తొలప్ప గార్డెన్ వద్ద కలిపి 5 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, తదితర ఏర్పాట్లు చేశామన్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించామన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టీటీడీకి చెందిన 52 ఆలయాల్లో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించామన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు.

Share this post with your friends