అనకాపల్లి జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ఏకాదశి కల్యాణాలు వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటి ఉదయం భక్తజన సందోహం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కాగా మంగళవారం రాత్రి 7.40 నుండి 9.30 గంటల వరకు స్వామివారు హంసవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మార్చి 12వ తేదీ రాత్రి 9 నుండి 10 గంటల వరకు శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు పుణ్యకోటి వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు.
మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు తోట ఉత్సవం, శ్రీ భూ సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారు రాజాధిరాజ వాహనంపై దర్శనమిస్తారు. అనంతరం రాత్రి 7.30 నుండి 10 గంటల వరకు శ్రీవారు గజవాహనంపై భక్తులను కటాక్షిస్తారు. మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు చక్రస్నానం జరగనుంది. రాత్రి 10.30 నుండి అర్థరాత్రి 12 గంటల వరకు రథోత్సవం వైభవంగా జరగనుంది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5.45 నుండి 6.30 గంటల వరకు ధ్వజావరోహణం, మార్చి 16, 17వ తేదీలలో రాత్రి 8 నుండి 9 గంటల వరకు పవలింపు సేవ నిర్వహించనున్నారు.