
ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించాడు. వాటిలో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఆ హయగ్రీవ జయంతి ఎప్పుడో కాదు.. ఇవాళే (శనివారం). మనం హయగ్రీవుడిని విద్యాధిపతిగానూ.. జ్ఞానప్రదాతగానూ కొలుచుకుంటూ ఉంటాం. హయగ్రీవ ప్రస్తావన.. దేవీ పురాణం, స్కాంద పురాణం, శ్రీమద్భాగవతం, ఆగమ శాస్త్రాల్లో ఉంది. హయగ్రీవుడు విద్యాధిపతి, జ్ఞానప్రదాత అని చెప్పుకున్నాం కదా. ఆయన జయంతి రోజున హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే పెద్ద ఎత్తున జ్ఞాన సంపద లభిస్తుందని పెద్దలు చెబుతారు. ముందుగా మనం హయగ్రీవ జయంతి వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాం.
పూర్వం గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ దేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. హయగ్రీవుడి తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు.. ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా.. తనలాంటి ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరమియ్యమని అడిగాడు. దానికి బ్రహ్మ దేవుడు తథాస్తు అనేశాడు. ఇక తనను ఎవరూ సంహరించలేరని భావించిన హయగ్రీవుడు సామాన్యులనే కాకుండా దేవతలను సైతం హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులైన శివపార్వతులను శరణు వేడుకోగా.. అప్పుడు పార్వతీదేవి వారికో ఉపాయం చెప్పింది. దక్షిణాయన పుణ్యకాలం సందర్భంగా యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తిని మేల్కొలిపితే ఆయన హయగ్రీవుడిని సంహారం గావిస్తాడని తెలిపింది.
దేవతలంతా ఆది దంపతులను వెంటబెట్టుకుని విష్ణుమూర్తి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. అప్పుడు శివుడు ఎలాగైనా విష్ణుమూర్తిని నిద్ర లేపాలని చెదపురుగుగా మారి వింటి తాడును తెంపాడు. దీంతో ఒక్కసారిగా విల్లు పైకి ఎగదన్నింది. అంతే.. శ్రీ మహావిష్ణువు తల ఆయన శరీరం నుంచి వేరై పోయింది. విష్ణుమూర్తి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి అమ్మవారితో సహా దేవతలంతా తమ జ్ఞానాన్ని, శక్తి సామర్ధ్యాలను ధారపోయడంతో.. ఆయన హయగ్రీవుని సంహరించి తన అవతార కార్యాన్ని నెరవేర్చాడట. అనంతరం లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు.
