పెద్ద శేష వాహనం విశిష్టత ఏంటంటే..

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వాహన సేవల నడుమ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రధానంగా జూన్ 06న గరుడ వాహనం, జూన్ 09న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. ఆదివారం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇక నిన్న ఉదయం, సాయంత్రం చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహన సేవలను భక్త జన సందోహం నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. అసలు పెద్ద శేష వాహన విశిష్టత ఏంటో ముందుగా తెలుసుకుందాం.

పెద్ద శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి ‘శేషశాయి’ అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి , ఏఈవో శ్రీ కె.మునికృష్ణారెడ్డి , శ్రీవారి సేవకులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends