
అత్యంత ఎత్తైన రాముల వారి విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 51 అడుగులతో కొలువుదీరాడు లోకాభిరాముడు. అది మన దేశంలో అనుకుంటున్నారా? కానే కాదు.. అగ్రరాజ్యంలో.. అమెరికాలోని గ్రేటర్ టొరంటో ఏరియాలో భాగమైన మిస్సిసాగాలో 51 అడుగుల శ్రీరామచంద్రుడు కొలువు దీరాడు. వేలాది మంది భక్త జన సందోహం నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఒంటారియోలోని హిందూ హెరిటేజ్ సెంటర్‌లో ఇప్పుడీ విగ్రహం ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.
అంతేకాకుండా ఈ ప్రాంతం సరికొత్త, అత్యంత ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది. ఈ విగ్రహ తయారీకి నాలుగేళ్లు పట్టింది. ఫైబర్‌గ్లాస్, బలమైన ఉక్కు సూపర్‌స్ట్రక్చర్‌తో బలమైన కెనడియన్ శీతాకాలాలు, గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను తట్టుకునేలా విగ్రహ రూపకల్పన జరిగింది. టొరంటో డౌన్‌టౌన్ నుండి కేవలం 30 నిమిషాలు ప్రయాణం చేస్తే చాలు హిందూ హెరిటేజ్ సెంటర్‌లోని ఈ విగ్రహాన్ని చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం ఉత్తర అమెరికా వ్యాప్తంగా సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇది ‘సమాజానికి ఆధ్యాత్మిక బహుమతి’గా ఆచార్య సురీందర్ శర్మ శాస్త్రి అభివర్ణించారు.
