ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం..

ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరికలు తీర్చే కల్పవల్లి విజయనగరం వాసుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సిరిమానును దర్శించుకునేందుకు తరలివచ్చారు. విజయనగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురు గుడి నుంచి సిరిమాను ప్రారంభమైంది. చదురుగుడి నుంచి కోట వరకు సిరిమాను మూడు సార్లు సిరిమాను తిరగనుంది. ఆలయ ప్రధాన పూజారి వెంకటరావు సిరిమానును అధిరోహించారు.

కోట బురుజుపై నుంచి గజపతి రాజుల వంశీయలు ఈ సిరిమానును దర్శించుకున్నారు. సిరిమానోత్సవంలో పలువురు మంత్రులు సైతం పాల్గొన్నారు. ఇవాళ ఉదయం పది గంటలకు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఆలయానికి వీఐపీలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే సామాన్యులు గంటల తరబడి అమ్మవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉపవాసం ఉన్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం అంతసేపు వేచి ఉండినా కూడా అమ్మవారి దర్శనం సరిగా అవడం లేదంటూ ఆరోపిస్తున్నారు.

Share this post with your friends