ఇస్కాన్ ఆలయాలు ప్రధాన నగరాల నుంచి పట్టణాల్లో సైతం నిర్మితమవుతున్నాయి. రాధాకృష్ణులు కొలువుదీరిన ఈ ఆలయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్ఘర్‌లోనూ ఓ ఇస్కాన్ ఆలయ నిర్మాణం పూర్తైంది. ఇది ఆసియాలోనే రెండో అతి పెద్ద ఇస్కాన్ ఆలయం కావడం విశేషం. ఈ ఆలయానికి శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్‌జీ ఆలయం అని పేరు పెట్టడం జరిగింది. ఈ రాధా మోహన్‌జీ ఆలయం 9 ఎకరాల్లో నిర్మితమైంది. ఈ నెల 15వ తేదీన అంటే రేపు ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అంటే ఐదు రోజులుగా ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు, యాగం వంటివి ప్రారంభించారు.
మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఖర్ఘర్‌లోని సెక్టార్ 23లో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి మొత్తం 12 సంవత్సరాలు పట్టింది. ఆలయాన్ని తెలుపు, గోధుమ రంగు ఉన్న పాలరాళ్లతో దీనిని నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో 2024 అక్టోబర్ 12న ఆలయాన్ని సందర్శించారు. మొత్తంగా రూ.200 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. జనవరి 15న ప్రధాని మోదీ ప్రారంభించనున్న ఈ ఆలయాన్ని త్రిడీ చిత్రాలతో అలంకరించారు. దీనిలో భాగంగా శ్రీ కృష్ణుడి జన్మ రహస్యం, శ్రీ కృష్ణుడి లీలలకు సంబంధించిన 3డీ చిత్రాలున్నాయి. ఈ ఆలయంతో పాటు రేపు ప్రధాని మోదీ సాంస్కృతిక కేంద్రం, వేద మ్యూజియానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు.