పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఈ పవిత్రోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

ముందుగా స్వామివారిని మంగళవారం ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద శాత్తుమొర నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభా ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

Share this post with your friends