వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేకం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఆలయ స్వర్ణ విమానావిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మరోవైపు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీప ప్రజ్వలన, అంకురార్పణ, ద్వార తోరణం ధ్వజ కుంభారాధన, అంకురార్పణ హోమం జరుగుతోంది. హోమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

మహాకుంభాభిషేకం సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 108 మంది ఋత్వికులతో పంచకుండాత్మక యాగం జరుగుతోంది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చరిత్రలో నిలవనుంది. ఈ విమాన గోపురం ఆవిష్కరణకు ముందు కుంభాభిషేకం, ప్రతిష్టాపన మహోత్సవాలను బుధవారం ప్రారంభించారు. టీటీడీ 33 అడుగుల నిర్మాణంతో పోల్చినా కూడా పాంచ నారసింహుని ఆలయ గోపురమే ఎత్తైనది. దీని ఎత్తు 55 అడుగులు. ఈ నెల 23న ఉదయం 11.54 గంటలకు 108 కలశాలతో సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ఠామహోత్సవం నిర్వహించనున్నారు.

Share this post with your friends