
శ్రీ గోవిందరాజస్వామి వైభవంగా తెప్పోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులను కటాక్షించారు. స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇక మూడో రోజు శనివారం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
పుష్కరిణిలో శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి వారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా ఆదివారం ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తెప్పోత్సవాల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
