శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు

తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రోజుకో స్వామివారు చొప్పున తెప్పలపై విహరించిన విషయం తెలిసిందే. తొలి నాడు శ్రీ వినాయక స్వామి తెప్పలపై ఐదు చుట్లు విహరించారు. రెండో రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఐదు చుట్లు, మూడో రోజు సోమస్కంద స్వామివారు ఐదు చుట్లు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. దీనిలో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చిన విషయం తెలిసిందే. ఇక చివరి రోజైన ఐదవ రోజు వైభవంగా తెప్పోత్సవం జరిగింది.

శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో చివరిరోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు కపిలతీర్థంలోని పుష్కరిణిలో తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి బక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేవారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ పాల్గొన్నారు.

Share this post with your friends