నేటి నుంచి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుక అత్యంత వైభవంగా జరిగింది. సప్త వాహనాలపై గోవిందరాజ స్వామి ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఇక నేటి నుంచి గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 12వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఈ ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజస్వామివారి పుష్క‌రిణిలో తెప్పల‌పై విహరిస్తారు.

అనంతరం స్వామివారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. నేటి నుంచి ఏ స్వామివార్ల తెప్పోత్సవం జరుగనుందో తెలుసుకుందాం. ఇవాళ శ్రీ కోదండరామస్వామివారు, 7న శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ పార్థసారథిస్వామి వారు, 8న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు, 9న ఆండాళ్‌ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, 10, 11, 12వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పల‌పై భక్తులకు కనువిందు చేయ‌నున్నారు. చివ‌రి రోజు తెప్పోత్స‌వం అనంత‌రం ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి స్వామివారు వేంచేపు చేస్తారు.

Share this post with your friends