కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై జగదభిరాముని అభ‌యం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉదయం 8 గంట‌ల‌కు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను అభ‌య‌మిచ్చారు. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ‘‘రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు. వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ ర‌వి, సూపరింటెండెంట్‌ శ్రీ మునిశంక‌ర్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends