
తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం ఎదుట ఫోటో షూట్ చేసిన దంపతులు అనంతరం తప్పు తెలుసుకుని శ్రీవారి సేవ ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటామంటూ ముందుకు వచ్చారు. తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్, గాయత్రీ దంపతులు ఇటీవల తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ చేయరాదనే నిబంధన తమకు ముందుగా తెలియకపోవడంతో, అనుకోకుండా కొన్ని ఫోటోలు తీసినట్లు వారు తెలిపారు.
అయితే, ఇది ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే, ఆ ఫోటోలను పూర్తిగా తొలగించినట్లు వారు స్పష్టం చేశారు. ఈ అనుకోని తప్పు పట్ల సదరు దంపతులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరారు. తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా, శ్రీవారి సేవ ద్వారా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దంపతులు తెలిపారు. భక్తిసేవ ద్వారా తమ తప్పును పరిహరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆలయ సంప్రదాయాలు, నియమాలు ప్రతి భక్తుడూ తప్పనిసరిగా గౌరవించాల్సినవేనని, ఈ సంఘటన ద్వారా తాము గుణపాఠం నేర్చుకున్నామని దంపతులు పేర్కొన్నారు.
