తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ పవిత్రోత్సవాలు బుధవారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో వేద పండితులు, అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.5 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ శాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.
చక్రస్నానం :
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీమతి గౌతమి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.