ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూన ఆలయం చెంత బుధవారం చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ హోమాన్ని టీటీడీ ఉన్నత వేదధ్యాయన సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ మహా కుంభ మేళా ముగిసే వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు వేదప్రియుడు. నాలుగు వేదాలతో జరిగే యాగాలు శాంతిని, సస్యశ్యామలాన్ని, లోక కల్యాణాన్ని ప్రసాదిస్తాయి. ఈ చతుర్వేద హవనం పాపకర్మలను, జీవకోటి దు:ఖాలను, కరువుకాటకాలను నశింపచేస్తుంది. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రయాగ్ రాజ్‌లోని మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని బుధవారం ఉడిపిలోని పలిమారు మఠాధిపతి శ్రీశ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, అర్చకులు స్వాగతం పలికి నమూనా ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం ఆయన స్వామివారి ఊంజల్ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారు వైకుంఠం నుండి తిరుపతికి వచ్చారని, ఇప్పుడు ఉత్తరాది భక్తుల కోసం మహా కుంభ మేళా నిర్వహించే పవిత్ర స్థలమైన ప్రయాగ్ రాజ్‌కు విచ్చేశారని చెప్పారు. భక్తులందరూ శ్రీవారిని దర్శించుకుని వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.