
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 5.20 గంటలకు మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి అభయం
బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన బుధవారం రాత్రి 7 నుండి హంస వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా కళాబృందాల కోలాటాలు, భజనల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు.
ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు.
