ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లనూ నిర్వహించింది. వేసవి కావడంతో అందుకు తగినట్టుగానే టీటీడీ ఏర్పాట్లను నిర్వహించింది. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం వాహన సేవల్లో స్వామివారు తరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

ఇంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ధ్వజావరోహణంతో ముగిశాయి. సాయంత్రం 8.40 నుండి 9.30 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, అర్చకులు, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends