గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజా సంబంధాల అధికారిణిగా పని చేసిన నిష్కా బేగంకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. నిష్కా బేగం ఇంటిపై ఈడీ దాడులు చేసిందనీ, ఆ నగలను స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. దీనిపై టీటీడీ స్పందించింది. కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరం. టీటీడీలో అటువంటి వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా ఎప్పుడూ లేరు. అంతే కాకుండా సదరు పోస్టులో గతంలో ఎక్కడో జరిగిన ఫోటోలను జతపరచి టీటీడీ పేరును వాడడాన్ని ఖండిస్తున్నాం.
భక్తులను తప్పుదోవ పట్టించి వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఇటువంటి అవాస్తవ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటుందని టీటీడీ మరొకసారి హెచ్చరిస్తోంది. తిరుమలలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, భారత ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారు మరియు డిఆర్‌డివో మాజీ ఛైర్మన్ డా.జి.సతీష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ మాట్లాడుతూ తిరుమలలో లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. ఇది తిరుమల పరిసర ప్రాంతాలతో పాటు ప్రజలకు ప్రమాదకరమని అన్నారు. ప్రతిరోజూ దాదాపు 50-60 టన్నుల వ్యర్థాలు ఇక్కడ ప్రోగుఅవుతున్నాయన్నారు. కాబట్టి వ్యర్థాలను తక్షణ క్లియరెన్స్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సమస్యకు శాశ్వత మరియు తక్షణ పరిష్కారం చూపాలని శ్రీ సతీష్ రెడ్డిని కోరామన్నారు. త్వరలో సమగ్ర నివేదిక అందిస్తారన్నారు.
అనంతరం శ్రీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన డంపింగ్ యార్డును క్లియర్ చేయాలనే ఆలోచన టీటీడీ ఛైర్మన్ కు రావడంపై అభినందించారు. ఈ వ్యర్థాలను ఎలా వేరు చేయాలో పరిశీలించేందుకు త్వరలో సాంకేతిక నిపుణుల బృందం తిరుమలలో సందర్శిస్తారని తెలిపారు. వ్యర్థాలలో కొంత భాగాన్ని కర్మాగారాలకు, మరికొంత భాగాన్ని ఎరువుగా ఉపయోగించవచ్చని సూచించారు. ముందుగా వ్యర్థాల నమూనాలను ల్యాబ్ టెస్టింగ్ కు పంపుతామన్నారు. ల్యాబ్ నివేదిక వచ్చాక ఈ సమస్యకు నిర్ధిష్ట పరిష్కార మార్గాన్ని నివేదిక రూపంలో అందిస్తామన్నారు.