మహాకుంభమేళాలో షాహిస్నాన్ సందర్భంగా తొక్కిసలాట.. 20 మంది మృతి

మహాకుంభమేళాలో అమృత్ స్నానం (షాహీస్నాన్) ఇవాళ ప్రారంభమైంది. మౌని అమావాస్య కారణంగా పెద్ద ఎత్తున భక్తులు మహా కుంభమేళాలో స్నానాలకు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. అయితే అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 20 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. వెంటనే క్షతగాత్రులను అక్కడి సెక్టార్-2 ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మాఘ మాస మౌని అమావాస్య మహిమాన్వితమైన శుభదినం. కాబట్టి పుణ్య స్నానాలకు కోట్లాది మంది వస్తారని ముందుగానే అంచనా వేశారు.

ఇవాళ పుణ్యస్నానాలకు కోట్లాది మంది వస్తారని ముందుగానే అంచనా వేసి దానికి తగినట్లు ఏర్పాటు చేశారు. అయినా కూడా తొక్కిసలాట జరిగింది. దీంతో అఖండ పరిషత్ కమిటీ అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. మౌనీ అమావాస్య కారణంగా తెల్లవారుజామున రెండున్నర తర్వాత నుంచే భక్తులను స్నానాలకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తెరిచిన వెంటనే భక్తులు ఒక్కసారిగా స్నానాలకు ముందుకు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగింది. విషయం తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగితో ప్రధాని మోదీ మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Share this post with your friends