శ్రీవారి ఆలయం నుంచి ఉదయం 4:30 గంటలకు అలిపిరికి శ్రీవారి సారె..

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖమైన పంచమి తీర్థానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు హృదయ పూర్వకంగా సేవలందించాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు పిలుపునిచ్చారు. పంచమి తీర్థానికి డిప్యూటేషన్‌ పై నియమితులైన ఉద్యోగులు తమ విధులను మరింత అంకితభావంతో సేవలు అందించాలని టీటీడీ ఈవో కోరారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం ప్రత్యేకంగా టీటీడీ సిబ్బందిని, శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, పంచమి తీర్థం పర్వదినం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు తమిళనాడు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు తిరుచానూరులో నాలుగు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పటికే భక్తులు హోల్డింగ్ పాయింట్లలో విశ్రాంతి తీసుకుంటున్నారని, వీరికి అన్న ప్రసాదాలు, అల్పాహారము, తాగునీరు, బాదంపాలు అందించేందుకు టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పుష్కరిణిలో ఒకేసారి 16 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించవచ్చని, రోజంతా స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుభ ఘడియలు రోజంతా ఉంటాయని, భక్తులు తోపులాటలకు గురికాకుండా సాయంత్రం వరకు స్నానం ఆచరించవచ్చు అని తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. పుష్కరిణిలోకి అవసరమైన ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. 1700 మంది భద్రతా సిబ్బంది, డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వివరించారు.

తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయం నుంచి ఉదయం 4.30 గంటలకు శ్రీవారి సారే బయలుదేరి అలిపిరికి చేరుకుంటుందని చెప్పారు. అలిపిరి నుండి శ్రీ కోదండ రామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజుస్వామి ఆలయం, తిరుచానూరులోని పసుపు మండపం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత పంచమి మండపంకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించనున్నట్లు చెప్పారు. సారే ఊరేగింపులో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు. పంచమి తీర్థం రోజున ప్రత్యేకంగా 1,000 మంది శ్రీవారి సేవకులతో అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ చేయనున్నట్లు ఈవో తెలిపారు.

Share this post with your friends