యూకేలో శ్రీనివాస కల్యాణం.. టీటీడీ ఫైర్

విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం టీటీడీ హెచ్చరించింది. యూకేలోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ 06.09.2025వ తేదీన యూనైటెడ్ కింగ్డమ్‌లోని సింగ్ సభ స్లొగ్ స్పోర్ట్స్ సెంటర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికను వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేశారు. సదరు శ్రీనివాస కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ఏపీఎన్ఆర్టీఎస్ నుంచి ఎలాంటి అనుమతి లేదు. పైగా టీటీడీ కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినప్పటికీ ఆహ్వాన పత్రికలో టీటీడీకి చెందిన లోగోను వాడారు.

టీటీడీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఒక విధంగా భక్తులను తప్పుదారి పట్టిస్తూ గందరగోళానికి గురిచేయడమే. అంతేకాక ఆహ్వాన పత్రికలో ఉచితం అని పేర్కొన్నప్పటికీ ప్రత్యేక సేవలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. భక్తుల నుండి సేవా ఫీజుల పేరుతో వసూళ్లు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆహ్వాన పత్రంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా, భక్తుల రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు సేవా ఫీజు (£ 566 పౌండ్లు) వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం కనిపించింది. డబ్బులు వసూలు చేసే అంశంతో పాటు టీటీడీ కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ, చీర, మంగళ్యం ధారం, జాకెట్టు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఫోటో ఫ్రేమ్ ఉన్నాయి.

సదరు నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలకు విజిలెన్స్ శాఖను టీటీడీ ఆదేశించింది. భక్తులను గందరగోళానికి గురిచేసే అనధికార కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. టీటీడీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా టీటీడీ పేరుతో శ్రీనివాస కల్యాణ మహోత్సవం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నకిలీ కల్యాణోత్సవాల పేరుతో ఎవరైనా సమాచారాన్ని వైరల్ చేసి డబ్బులు కోరితే టీటీడీ విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకురావాలని కోరుతోంది.

Share this post with your friends