శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం ముందు ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి ఆవిష్క‌రించారు. ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ‌వారి ఆస్థాన‌మైన టీటీడీ ప్ర‌తి సంవ‌త్స‌రం పంచాంగాన్ని భ‌క్త లోకానికి అందించ‌డం అన‌వాయితీగా వ‌స్తున్న‌దే. అదేప్ర‌కారం ఈ ఏడాది కూడా నూత‌న సంచాంగాన్ని భ‌క్తుల‌కు అందిస్తోంది.

ఇందులో భాగంగా రాబోయే శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది. టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకట పూర్ణప్రసాద్‌ సిద్ధాంతి రాసిన ఈ పంచాంగాన్ని వైఖాన‌స పండితులు ఆచార్య వేదాంతం విష్ణుభ‌ట్టా చార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు. రూ.75/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టిటిడి సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుండి పంచాంగం అందుబాటులో ఉంటుంది.

Share this post with your friends