అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ వేంకటేశ్వరస్వామి

తిరుపతి జిల్లా శ్రీకాళ‌హ‌స్తి మండ‌లం తొండ‌మాన్‌పురం గ్రామంలో శ్రీదేవి, భూదేవి స‌మేత ప్ర‌స‌న్న అభ‌య‌హ‌స్త ఆసీన‌ శ్రీ వేంకటేశ్వర‌స్వామి కొలువై ఉన్నాడు. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలను అతయంత వైభవంగా ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది.

భక్తులు పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్నారు. వాహనసేవలో పాల్గొని అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు నిర్వహించారు. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్త నాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు. వాహ‌న సేవ‌లో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, సూపరింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ర‌వి కుమార్ రెడ్డి, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends