శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్‌లైన్ టికెట్లు 10 రోజుల పాటు రద్దు

అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లు 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల పెద్ద ఎత్తున అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతుల్లో తిరుమల శ్రీవారి ఆలయం మెరిసిపోతోంది.

వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాల దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులతో తిరుమల గిరులు కిటకిట లాడుతున్నాయి. గోవింద నామ స్మరణతో తిరుమల మారుమోగుతోంది. తెల్లవారు జాము నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం శ్రీవారిని దర్శించుకున్నారు. ఒకవైపు విద్యుత్ దీపకాంతులు.. మరోవైపు వివిధ రకాల పుష్పాల అలంకరణతో తిరుమలేశుడు మెరిసిపోతున్నాడు. తిరుమల శ్రీవారి ఆలయ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి నాడు గోవింద మాల ధారణతో స్వామి దర్శనం కోసం వచ్చారు.

Share this post with your friends