
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సింహ రూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు నిరూపిస్తున్నారు. అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
శనివారం రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.
