
మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ఉదయం పూర్ణాహుతితో పవిత్ర ఉత్సవాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ముగించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, సహస్రనామార్చన, పవిత్ర విసర్జన, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లను స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
16న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆడికృత్తిక
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 16వ తేదీన ఆడికృత్తిక పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
