
శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిష్కరించింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిని ఆవిష్కరించడం జరిగింది. ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో భాగంగా రాబోయే శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆకర్షణీయంగా ముద్రించింది.
పంచాంగాన్ని రచించిన టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వేంకటకృష్ణ పూర్ణ ప్రసాద్ సిద్ధాంతి గారికి, పరిష్కరించిన వైఖానసాగమ పండితులు ఆచార్య శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు సులభంగా, అందరికీ అర్థమయ్యేలా పరిష్కరించారు. రాజాధి నవనాయకుల ఫలితాలతోపాటు రాశిఫలాలు, వధూవర గుణమేళనము, వివాహాది సుముహూర్త నిర్ణయాలు, టిటిడిలో నిర్వహించే విశేష ఉత్సవాలు తదితర విషయాలను చక్కగా వివరించారు. రూ.75/- విలువ గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో ఆదివారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. మిగతా టీటీడీ సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుంచి పంచాంగం అందుబాటులో ఉంటుంది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరణ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను సైతం టీటీడీ ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం బోర్డు సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5వ తేది వరకు ఒంటిమిట్ట శ్రీ కోందండరామాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదిన రాష్ట్ర పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించనుంది.
