సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజున వాహన సేవలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున హాజరై వాహన సేవలను తిలకించారు. శనివారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చిన సంగతి తెలిసిందే. అమ్మవారికి ముత్యాలంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. అందుకే అమ్మవారికి అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

శనివారం రాత్రి సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తుఫాన్ నేపథ్యంలో వాహన మండపంలో భక్తులు అమ్మవారిని సేవించుకున్నారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో శ్రీ శ్యామల రావు, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends