సూర్యప్రభ వాహనంపై గోవర్ధన గిరిధారి రూపంలో శ్రీ పద్మావతి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు శ్రీ గోవర్ధనగిరిధారియైన శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. భక్తులు అడుగడుగునా నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడుగా భావిస్తూ ఉంటాం. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానుని కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుంది.

Share this post with your friends