
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడు విహరించి భక్తులను ఆశీర్వదించారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీ శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి 7 గంటల నుండి హంస వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే.
