
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వైభవోత్సవాల్లో వాహన సేవలు సైతం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం 6.30 గం.లకు లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకువచ్చి స్వామి వారిని అలంకరించారు. నిన్న శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవాన్ని శ్రీవారి మెట్టు సమీపంలో గురువారం వైభవంగా నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
