శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంబమయ్యాయి. మొదటిరోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు పరమపద వైకుంఠ నాథుని అలంకారంలో కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు. శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు. వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధన శేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.