
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వాహన సేవల్లో దేవేరులతో శ్రీ గోవిందరాజస్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజైన గురువారం రాత్రి స్వామి వారు సర్వభూపాల వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వభూపాల అంటే రాజులందరు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు.
వీరందరూ శ్రీ గోవిందరాజ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. అనంతవిశ్వానికి సర్వభూపాలుడు అయిన శ్రీ గోవిందరాజస్వామి కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వభూపాల వాహనాన్ని అధిరోహిస్తాడు. అంతేగాక పాలకుల అధికారి దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్సేవాపరులు కావాలని సర్వభూపాల వాహనసేవ ద్వారా స్వామివారు దివ్యమైన సందేశాన్ని ఇస్తారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏవో శ్రీ ఓ.బాలాజీ, డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, ఏవీఎస్వో శ్రీ మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
