భగవద్గీతతో సమాజానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం

ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం ద్వారా సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని డీపీపీ కార్యదర్శి శ్రీ రఘునాథ్ అన్నారు. టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్తం పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బుధవారం సాయంత్రం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సమాజంలో ఆధ్యాత్మిక కోణంలో ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందన్నారు. చెడు మీద మంచి విజ‌యం సాధించ‌డ‌మే గీతా సారాంశ‌మ‌ని తెలిపారు. చిన్న వ‌య‌స్సులోనే భగవద్గీత శ్లోకాల‌ను శాస్త్ర‌బ‌ద్ధంగా ప‌ఠించ‌డం, దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భ‌విష్య‌త్తులో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహిస్తార‌న్నారు.

భగవద్గీతలో 7వ అధ్యాయమైన శ్రద్దాత్రయ విభాగ యోగంపై 6 మరియు 7 తరగతులు ఒక విభాగంగాను, 8 మరియు 9 తరగతులు మరో విభాగాలకు ఈ పోటీలు జరిగాయి. అలాగే 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీత కంఠస్థ విభాగంలో 18 సంవత్సరాల వయసు పైబడిన వారు, 18 సంవత్సరాల లోపు వారికి వేరువేరుగా పోటీలు జరిగాయి. ఈ నాలుగు విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రఘునాథ్ బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ ఆచార్యులు శ్రీ చక్రవర్తి రాఘవన్, శ్రీ సముద్రాల దశరథ్, శ్రీ రామకృష్ణ శేష సాయి, శ్రీమతి సునీత, శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీ శ్రీనివాసరావు, శ్రీమతి భాగ్యలక్ష్మి గీతా వైశిష్ట్యంపై ఉపన్యసించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీమతి కోకిల, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends