యాదగిరిగుట్టలో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం తరువాత భక్తుల తాకిడి బాగా పెరిగింది. ఆలయ సిబ్బంది సైతం భక్తుల అవసరాలకు పెద్ద పీట వేస్తోంది. తెలంగాణ తిరుపతిగా పేరుందిన యాదగిరిగుట్ట పాంచ నారసింహుడి ఆలయం పేరుగాంచింది. ఈ ఆలయానికి సాధారణ రోజుల్లో రోజుకు 40 వేల మంది భక్తులు వస్తుండగా.. సెలవు దినాల్లో 60 వేల మంది భక్తులు వస్తుంటారు. వారికి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లనూ చేస్తోంది. అయితే ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లులకు మాత్రం కొంత అసౌకర్యం కలుగుతోంది. దీనిపై తాజాగా ఆలయ అధికారులు ఫోకస్ పెట్టారు.

దానిలో భాగంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని ఆలయ పాలక మండలి తార్మానం చేసింది. దీనికోసం కొండపై ఉన్న ప్రధాన ఆలయ తూర్పు ద్వారం ముందు ఏడడుగుల గేట్‌తో కూడిన గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే ఈ ద్వారానికి ముందు దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు కూర్చోవడానికి బెంచీలు, కుర్చీలను సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేకంగా టైంను కూడా కేటాయించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11.30గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 5.30గంటల సమయంలో వీరికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లులను ప్రత్యేక క్యూ లైన్‌లో తీసుకెళ్లి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు.

Share this post with your friends