కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ స్వామి అలంకారంలో సిరులతల్లి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మవారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ, చిరుజల్లుల మధ్య వాహనసేవ కోలాహలంగా జరిగింది.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఐహిక ఫ‌ల ప్రాప్తి

పాలకడలిని అమృతం కోసం మథించినవేళ లక్ష్మీదేవికి తోబుట్టువైంది కల్పవృక్షం. ఆకలిదప్పుల్ని తొలగించి, పూర్వజన్మస్మరణను ప్రసాదించే ఈ ఉదారదేవతావృక్షం అన్ని కోరికలనూ తీరుస్తుంది. ఖడ్గాన్ని, యోగదండాన్ని ధరించే గోపకిశోరుడిలా గోసంపదను పరిరక్షించే మంగళదేవత అలమేలుమంగ. మంగమ్మ పాదాలు కల్పతరువు చిగురును తలపిస్తున్నాయని అన్నమయ్య కీర్తించాడు. కోర్కెలను ఈడేర్చే కల్పవృక్షంపై విహరిస్తున్న అలమేలుమంగ ఆశ్రితభక్తులకు లేముల్ని తొలగించే పరిపూర్ణశక్తి.

Share this post with your friends