
విశాఖ సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ భక్త జన సందోహం నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే పెద్ద ఎత్తున భక్తులు చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అప్పన్న నామ స్మరణతో సింహాచలం మారుమోగుతోంది.
సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మొత్తంగా 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ గిరి ప్రదక్షిణ తొలిపావంచా దగ్గర ప్రారంభమవుతుంది. అనంతరం అడవివరం, ముడుసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం కూడలి, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, పాతగోశాల మీదుగా కొనసాగుతుంది. చివరకు సింహాచలం అప్పన్న ఆలయం వద్ద ముగుస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ తెల్లవారుజామునే మొదలవుతుంది. రేపు తెల్లవారుజాము వరకూ కొనసాగుతుంది. ఇక సింహాద్రి అప్పన్న స్వామివారి తుది విడత చందనోత్సవాన్ని సైతం గిరి ప్రదక్షిణ ముగిసిన తర్వాత ఆషాడ పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
