తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు, హోమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కార్తీక మాసం మొత్తం అంటే నెల రనోజుల పాటు ప్రత్యేక పూజలతో పాటు హోమ మహోత్సవాలను శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్నారు. ఇప్పటికే గణపతి హోమంతో పాటు సుబ్రహ్మణ్య స్వామివారి హోమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. శ్రీ స్వామివారిని దర్శించుకుని భక్తులు హోమాల్లో పాల్గొంటున్నారు. శనివారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది.
నవగ్రహ హోమంలో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టారు. హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీ యాగం) జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.