
భక్తుల ఐశ్వర్యం, ఆయురారోగ్య సంపదలు కాంక్షిస్తూ తిరుమల ధర్మగిరిలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం బుధవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది. మొత్తం 32 మంది వేదపండితుల సమక్షంలో జరిగిన ఈ మహాయాగంలో వేదపారాయణం, సుందరకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరిగాయి. ఈ యాగానికి హాజరైన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం వైభవంగా ముగిసిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వశాంతి యాగాలు, హవనాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని అన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలియజేశారు.
అందుబాటులోకి శ్రీవారి పుష్కరిణి..
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణి బుధవారం నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ మరమ్మతు పనులు టీటీడీ జూలై 20 తేదిన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగులు (పెయింటింగ్) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మతు పనులు పూర్తిచేశారు. అయితే స్వామి పుష్కరిణి మరమ్మతు పనుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజులపాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. బుధవారం నుంచి భక్తులను పుష్కరిణీలో అనుమతించారు.
